హవాలా నగదు రూ.3.35 కోట్ల ను పట్టుకున్న పోలీసులు

హవాలా నగదు రూ.3.35 కోట్ల ను పట్టుకున్న పోలీసులు

డెస్క్ : హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పరిధిలోని నలుగురు వ్యక్తుల నుంచి భారీ హవాలా మనీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.3.35 కోట్ల నగదును బంజారాహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని నార్త్జోన్ టాస్క్ ఫోర్స్ తో కలిసి బంజారాహిల్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 3 వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులకి అనుమానాస్పదంగా ఉన్న కియా కారును తనిఖీ చేశారు. కారులో రూ.3.35 కోట్ల నగదుని గుర్తించారు. ఈ మొత్తాన్ని హవాలా మనీగా నిర్ధారించుకుని.. డబ్బుతో పాటు నలుగురు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన చింపిరెడ్డి హనుమంత రెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాముల రెడ్డి, ఉదయ్ కుమార్ లు గా గుర్తించారు. ఇందులో ప్రధాన సూత్రధారి చింపిరెడ్డి అని తేలింది. ప్రధాన నిందితుడు సూచనల మేరకు మిగిలి ముగ్గురు నిందితులు హవాలా మనీ సేకరిస్తారని డీసీపీ తెలిపారు. ఈ గ్యాంగ్ వివిధ ప్రాంతాల్లో డబ్బులను తరలిస్తారని పేర్కొన్నారు. బంజారాహిల్స్ లోని అరోరా కాలనీలోని సాయి కృప బిల్డింగ్లో ప్లాట్ నంబర్ 583 ని తమ కార్యాలయంగా మార్చుకుని ఈ దందా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఈ గ్యాంగ్ సేకరించిన హవాలా మనీని తమ కార్యాలయానికి తీసుకు వెళ్తుండగా పట్టుకున్నారని.. ఆ ప్లాట్ని సీజ్ చేశారని తెలిపారు. వారు కోటి రూపాయలకి రూ.25,000 కమీషన్ గా తీసుకుంటున్నా రని గుర్తించారు. ఇవాళ ఉదయం ప్రభాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి కలిసి బేగం బజార్, గోషామహల్, నాంపల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రూ.3.35 కోట్లు సేకరించారని అన్నారు. పట్టుకున్న నగదు మొత్తాన్ని కోర్టులో సబ్మిట్ చేస్తారని డీసీపీ జోయల్ డెవిస్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహన తనిఖీలు మరింత విస్తృతంగా చేస్తామని అన్నారు.