ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు
– దామెరకుంటలో భక్తులకు తృటిలో తప్పిన ప్రమాదం
కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : పండుగలలో మొదటి పండుగగా భావించి తొలి ఏకాదశి పర్వదినాన్ని ఇంటింటా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు.తొలి ఏకాదశిపండుగ సందర్భంగా ఉదయానికి పూర్వమే మేల్కొని నది స్నానాలు ఆచరించి, పూజారి కార్యక్రమాలను నిర్వహిం చారు. ఇంటింటా శివ, కేశవులను స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో పుణ్య స్థానాలను ఆచరించారు. ఉత్తర వాహిని గా గోదావరి నది ప్రవహించడం దామెరకుంట లో ప్రత్యేకం. భక్తులతో దామెరకుంట గోదావరి తీరం కిక్కిరిసిపోయింది. పుణ్య స్నానాల అనంతరం మర్రిచెట్టు కింద వెలిసిన అన్నపూర్ణ దేవి, విశ్వేశ్వరులను మహిళలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
– దామెరకుంటలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
మండలంలోని దామెరకుంట గ్రామంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గోదావరి నదీ స్నానానికి వెళ్లి తిరిగి వస్తుండగా సుమారు 15 మంది ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ ఒక్కసారిగా బురదలో కూరుకుపోయింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ లో ప్రయాణిస్తున్న భక్తులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి అపాయం లేకుండా భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గోదావరి నదీ స్నానానికి వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం లేక ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి బాసాని రవి మాట్లాడుతూ ప్రతి తొలి ఏకాదశి నాడు దామెరకుంట గ్రామంలోని గోదావరి తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున జాతర జరుగుతుందని, ప్రజాప్రతినిధుల పదవీకాలం పూర్తి కావడం తో, ఈసారి అధికారులు జాతరలో కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రోడ్డు మరమ్మత్తులను తూతూ మంత్రంగా పనులు చేపట్టారని, రోడ్డు పనుల విషయంపై గ్రామ కార్యదర్శి కి ఫోన్ చేసినా కనీసం స్పందించడం లేదని తెలిపారు. భక్తుల అవసరార్థం గ్రామం నుండి అన్నపూర్ణ దేవాలయం వరకు సిసి రోడ్డు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.