వేగంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
వేగంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై చేరిన వరద నీరు
– ఎన్ హెచ్ 163 పై రాకపోకలు బంద్.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : గోదావరి వరద గత నాలుగు రోజుల క్రితం నుండి తగ్గినట్టే తగ్గి, స్వ ల్పంగా పెరుగుతూ తగ్గుతూ దోబూచులాడుతున్నది. దీంతో గోదావరి తీర ప్రాంత ప్రజలు వరద ప్రమాదం తప్పిపో యిందని ఊపిరి పిల్చుకున్నారు. గోదావరి జీవనదులు ప్రవహించే క్యాచ్ మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కారణంగా సోమవారం మధ్యాహ్నం నుండి గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. దీంతో ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం వద్ద గోదావరి వరద నీరు వంతెనను ముంచి వేసింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గడ్ అంతర్రాష్ట్ర రవాణా సోమవారం రాత్రి నుండి నిలిచిపోయింది. జాతీయ రహదారి 163 పై సుమారు 6 అడుగులకు పైగా వరద నీరు చేరటంతో సోమవారం రాత్రి నుండి ఇరువైపులా వాహనాలు నిలిచి పోయాయి. అలాగే భారి వర్షాలతో ములుగు జిల్లా వెంక టాపురం,వాజేడు ఏజెన్సీ ప్రాంతంలో అనేక కొండ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వెంకటాపురం సమీపంలోని గోదావరి పాయ సోమవారం రాత్రి నుండి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నది. మరి కాల దానవైపేట నిర్జన గ్రామం వద్ద గోదావరి నది నుండి పాయ విడిపోఇ మండల పరిధిలోని పాలెం వద్ద గోదావరిలో తిరిగి పాయ కలస్తున్నది. సుమారు 8 కిలోమీటర్లు పైగా గోదావరి పాయ ప్రవహించి తిరిగి పెద్ద గోదావరిలో కలుస్తుంది. గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతూ ఉండటంతో గోదావరి తీర ప్రాంతం , పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు కారణంగా వాగులు దాటవద్దని, చేపల వేటకు వెళ్లరాదని రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసే పనిలో గతం నుండే నిమగ్నమయ్యారు. ఒకపక్క భారీ వర్షాలు, మరోపక్క గోదావరి వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రకృతి వైపరీత్యాలు కన్నెర్ర చేయటంతో రైతాంగం, ప్రజలు సతమతమవుతున్నారు.