టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై గోదావరి వరద నీరు. 

టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై గోదావరి వరద నీరు. 

– స్తంభించిన రాకపోకలు.. స్టాప్ బోర్డ్ ఏర్పాటు…

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దులోని టేకులగూడెం వద్ద 163 జాతీయ రహదారిపై కి ఆదివారం వేకువ జామునుండే గోదావరి వరద నీరు రేగుమాకు వాగు గుండా చొచ్చుకు రావడంతో జాతీయ రహదారిపై సుమారు అయిదు అడుగులకు పైగా వరద నీరు చేరుకుంది. గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతూ ఉండటంతో కేంద్ర జల సంఘం, ఎప్పటికప్పుడు గోదావరి నీటిమట్టాన్ని తెలియపరుస్తున్నది. అలాగే వాజేడు మండలంలోని పేరూరు లో ఏర్పాటుచేసిన సెంట్రల్ వాటర్ కమిషన్ కంట్రోల్ రూమ్ నుండి ఆదివారం ఉదయం ఏడు గంటలకు 15.7 మీటర్లు గోదావరి నీటిమట్టం ఉన్నట్లు రికార్డ్ అయింది. టేకులగూడెం వద్ద జాతీయ రహదారి పైకి గోదావరి వరద విషయం తెలుసుకున్న వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్, పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గుర్రం కృష్ణ ప్రసాద్ పోలీస్ సిబ్బంది హుటాహుటిన వేకువజామునే జాతీయ రహదారి వద్దకు చేరుకొని రాకపోకలపై నిషేధం విధిస్తూ స్టాప్ బోర్డును ఏర్పాటు చేశారు. అలాగే టేకులగూడెం పంచాయతీ కి చెందిన సిబ్బందిని, పంచాయతీ కార్యదర్శిని, పేరూరు పోలీస్ సిబ్బందిని వాహనాల రాకపోకలపై జాగ్రత్తలు వహించాలని, నిలిపివేయాలని పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వరంగల్ టు ఛత్తీస్గడ్ బీజాపూర్ ఎన్హెచ్ 163 పై రాకపోకలు ఆదివారం ఉదయం నుండి రాకపోకలు నిలిచిపోయాయి.కాగా చతిస్గడ్, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, తెలంగాణా మరియు ఇతర ప్రాంతాలకు జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలు టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరుకోవటంతో, కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచి పోయాయి. అలాగే జాతీయ రహదారి నుండి జగన్నాధపురం వై జక్షన్ నుండి వెంకటాపురం రాష్ట్రీయ రహదారి నెంబర్ 12 మీదుగా వెంకటాపురం, చర్ల ,భద్రాచలం వెళ్లేందుకు కొన్ని వాహనాలు యూటర్న్ గా వెంకటాపురం వైపు నుండి ప్రయాణిస్తున్నట్లు సమాచారం. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కారణంగా అనేక వాగులు పొంగి ప్రవహిస్తున్నండంతో గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగు తున్నది. సాయంత్రం లోగా వెంకటాపురం భద్రాచలం రాష్ట్రీయ రహదారి నెంబర్ 12 పై అనేక వాగులు కూడా గోదావరి నీరు వాగుల గుఃడా వెనుకకు వచ్చి రహదారిపైకి చేరుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు వెంకటాపురం సమీపంలోని బల్లకట్టు వాగు, కొండాపురం వాగు, రాళ్లవాగు తదితర వెంకటాపురం పి.ఎస్. పరిధిలోకి వచ్చే వాగుల వద్ద పోలీస్ శాఖ ఫ్లడ్ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలతో రక్షణ పరమైన ఏర్పాట్లు నిర్వహించారు. ఇందులో భాగంగా అవసరమైతే ముంపు గురి అయ్యే ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వెంకటాపురం రెవిన్యూ కార్యాలయానికి మరపడవలను సిద్ధం చేసి ఉంచారు.