పాము కాటుతో బాలిక మృతి – శాంతి నగర్ గ్రామంలో విషాదం.
పాము కాటుతో బాలిక మృతి – శాంతి నగర్ గ్రామంలో విషాదం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం శివారు బీ.సీ. మర్రి గూడెం పంచాయతీ శాంతి నగర్ గ్రామంలో విషాదం చోటు చేసుకున్నది. తాటి మనోజ్ – కౌసల్య గిరిజన దంపతుల కుమార్తె తాటి కావ్య శ్రీ (12) బర్లగూడెం పంచాయతీ చిరుత పల్లి ఐటిడిఎ బాలికల ఆశ్రమ పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్నది. శనివారం శాంతి నగర్లోని తమ ఇంట్లో నేలపై నిద్రిస్తుండగా కట్లపాము అర్ధరాత్రి సమయంలో కాటు వేసింది. ఏదో కాటు వేసిందని తల్లి దండ్రులు కేకలు వేస్తూ తెలపగా అప్పుడే కాటు వేసి పారిపోతున్న కట్లపామును చంపివేశారు. హుటా హుటిన వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అత్యంత విష పూరితమైన కట్లపాము కాటు విషం ఒళ్లంతా పాకిపోయి వైద్య సేవలు అందిస్తుండగా మృతి చెందింది. ఎప్పుడు ఆడుతూ, పాడుతూ కలిసి ,మెలిసి ఉండే బాలిక కావ్య శ్రీ పాము కాటుకు మృతి చెందడంతో శాంతి నగరం గ్రామంలో విషాదం చోటు చేసుకున్నది. అల్లారు ముద్దుగా పెంచి చదివించుకుంటున్న తమ కుమార్తె, పాముకాటుతో మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువుల లను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.