గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర, ప్రశాంత వాతావరణంలో జరగాలి
– జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: గణేష్ శోభా యాత్ర, నిమజ్జనం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరగాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టామని, గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు, పోలీసుల సూచనలను పాటించాలని ఎస్పీ తెలిపినారు. గణేష్ నవరాత్రులు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయనీ, అలాగే గణేష్ శోభాయాత్ర, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రజలు సంతోష కరమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించుకో వాలని, ఇప్పటికే పోలీసు శాఖ 300 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తుందని, గణేష్ నిమజ్జనం శోభయాత్ర ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగేలా పగడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిమజ్జనం చేసే చెరువులు, కుంటలు, నదుల వద్ద ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గణేష్ ఊరేగింపు సమయంలో గ్రామాల్లో విద్యుత్ తీగల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిమజ్జనం కోసం కండిషన్లో ఉన్న వాహనాలు మాత్రమే గణేష్ శోభాయాత్రకు వినియోగించాలని అన్నారు. గణేష్ వినాయక ప్రతిమను ఊరేగించే వాహన డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని, మద్యం తాగి వాహనం నడుపరాదని, తాగి నడిపితే చర్యలు తప్పని హెచ్చరించారు. ఈతరాని వారు ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జన సమయంలో నీళ్లలో దిగకూడదని ఎస్పీ సూచిం. Kú అప్చారు. నిమజ్జనం రోజున వాహనాలపై డీజేతో కూడిన మ్యూజిక్ సిస్టం వినియోగించకూడదని, అలాగే ఇతర మతాలను గాని, ఇతర వర్గాలకు చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ఎలాంటి రెచ్చగొట్టే పనులు, వాఖ్యలు చేయవద్దన్నారు. చిన్నారులను, వృద్ధులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలని ఎస్పీ కోరారు. జిల్లాలో ప్రశాంతంగా శోభాయాత్ర, నిమజ్జన నిర్వహణ కోసం ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉత్సవ కమిటీ సభ్యులు, శాంతి కమిటీ సభ్యులతో పోలీసు అధికారులు సమావేశం నిర్వహించారని, ఎవరయినా శాంతిభద్రతల విఘాతం కలిగిస్తూ, చట్ట వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడితే సంబధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని, ఏదైనా సంఘటన జరిగితే నిర్వహకులు వెంటనే స్థానిక పోలీసులకు, లేదా డయల్ 100 కు తెలియజేయాలని, అలాగే ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి వదంతులు, పుకార్లను నమ్మవద్దని ప్రజలను ఎస్పీ కిరణ్ ఖరే కోరారు.