పరిషికగూడెంలో ఆదివాసీలకు మంచినీటి కష్టాలు.
పరిషికగూడెంలో ఆదివాసీలకు మంచినీటి కష్టాలు.
- పొలాల్లో చెలిమలు తవ్వుకొని మంచినీరు తెచ్చుకుంటున్న గిరిజనులు.
- పట్టించుకోని ప్రభుత్వం జీ.పి. పాలకవర్గాలు
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం పంచాయతీ పర్శిక గూడెం ఆదివాసి గ్రామం లో గత కొన్ని నెలలుగా మంచినీటి కష్టాల సమస్య నెలకొంది. సుమారు 30 కుటుంబాలు కలిగిన పర్శిక గూడంలో మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు నిర్మాణం పేరుతో పైపులైన్లు తొలగించడం జరిగింది. బర్లగూడెం పంచాయతీ పరిధిలోని రామవరం నుండి పరిశిక గూడెం వరకు రోడ్డు నిర్మాణం కొరకు కాంట్రాక్టర్ జెసిబిల ద్వారా ఇరువైపులా బంటాలు , గోతులు తవ్వి గ్రామానికి వెళ్లే మిషన్ భగీరథ పైపులను తొలగించారు. రోడ్డు కాంట్రాక్టర్ సుమారు నాలుగు నెలల క్రితం రోడ్డు నిర్మాణం పనులు చేపట్టగా, అప్పటినుండి గ్రామంలోకి మంచినీటి సరఫరా నిలిచిపోయింది. అలాగే జి.పి బోరు సైతం మరమ్మతులు గురై గ్రామ ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిషక గూడెంలో ఊరు పక్క న ఉన్న పొలాల్లో చెలిమలు, చెరువులు కుంటల నుండి మంచినీటిని గ్రామాల్లోకి తెచ్చుకుంటున్నారు. గ్రామ ఎంపీటీసీ సమ్మక్క గ్రామ ఆదివాసుల మంచినీటి సమస్య పై పలుమార్లు అధికారులకు, పంచాయతీ పాలకవర్గానికి ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరధ అదికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుక్కెడు మంచినీళ్లు దొరక్క ఆదివాసి లు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నెలల తరబడి నీళ్ల కోసం ఆదివాసులు పడుతున్న నీటి కష్టాలతో సతమతమవుతున్నారని, అయినా కానీ పాలకవర్గాలు ప్రభుత్వ వర్గాలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బర్లగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న పర్శిక గూడెం ఆదివాసుల మంచినీటి కష్టాలు తీర్చాలని పలుమార్లు విన్నపాలు చేసిన పంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడంలేదని, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులపై గ్రామ ప్రజలు ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టర్, ఎటురునాగారం ఐటీడీఏ పీవో స్పందించి తమ గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని 30 కుటుంబాలు కలిగిన ఆదివాసి ప్రజలు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.