కంటి సమస్యల బాధితులకు ఉచిత శస్త్ర చికిత్సలు
– వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
కాటారం, తెలంగాణజ్యోతి : కంటి చూపు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల కోసం పుష్పగిరి హాస్పిటల్ సౌజన్యంతో కాటారం సబ్ డివిజన్లో వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీనుబాబు కలెక్టర్ తో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఉచిత కంటివైద్యం అందించేందుకు ఈనెల 14న కంటి హాస్పిటల్ భవన నిర్మాణంనకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. దుద్దిళ్ళ శ్రీపాద రావు 26వ వర్ధంతి సందర్భంగా పుష్పగిరి ఆసుపత్రి ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 2 రోజుల ఉచిత కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిళ్ళ శ్రీపాద రావు 26వ వర్ధంతి సందర్భంగా కాటారం మండలం లో ఉచిత కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేసినందుకు పుష్పగిరి ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కంటి చూపు లోపం ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి కంటి పరీక్ష చేసుకోవాలని. చికిత్స అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య సేవలు అందించి కంటి అద్దాలు ఇస్తారని తెలిపారు. మా కుటుంబంపై మీకున్న ప్రేమానురాగలకు దుద్దిళ్ళ కుటుంబం ఎల్లప్పుడూ సేవకులుగా ఉంటామని భవిష్య త్తులో పేద ప్రజలకు ఉపయోగపడే సేవ కార్యక్రమాలను చేస్తామ ని రెండు రోజులు కొనసాగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని శ్రీను బాబు కోరారు.
వెయ్యిమందికి పైగా శిబిరానికి హాజరు
ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు 1000 మందికి పైగా పాల్గొన్నారు. మూడు ప్రదేశాలలో కంటి పరీక్షల చేయగా శస్త్ర చికిత్సలు అవసరమున్న వారిని గుర్తించారు. ఆపరేషన్లు చేయాల్సిన వారికి హైదరాబాదులో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గ్రామ స్థాయిలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారిని ఆశ వర్కర్లు గుర్తించి శిబిరానికి తీసుకొచ్చారు. వైద్య శిబిరంలో పాల్గొన్న పుష్పగిరి హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బందికి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, వైద్యశాఖ అధికారి మధుసూదన్ శ్రీపాద ట్రస్టు చైర్మన్ శ్రీను బాబు మెమెంటో ఇచ్చారు.