విద్యాభివృద్ధికి ఫాతిమా షేక్ కృషి : సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్
మహబూబాబాద్, తెలంగాణ జ్యోతి : చదువుతోనే సమ సమాజ నిర్మాణం ఏర్పాటవుతుందని, మహిళ విద్యాభివృద్ధికి కృషి చేసిన ఫాతిమా షేక్ గొప్ప సామాజిక సంఘసంస్కర్త అని మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. భారత తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 193వ జయంతి సందర్భంగా మంగళవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫాతిమా షేక్ చిత్ర పటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఆల్ అన్సార్ యూత్ మరియు మా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని ఫాతిమా షేక్ చిత్ర పటానికి పూలమాల వేసి ప్రసంగించారు. ప్రాచీన కాలంలో విద్య సామాన్యులకు అందని ద్రాక్షగా ఉండేదని అలాంటి తరుణంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులతో కలిసి సమాజంలో ఎదురయ్యే అసమానతలను రూపుమాపుతూ మహిళా అభ్యున్నతికి ఫాతిమా షేక్ కృషి చేశారని తస్లీమా అన్నారు. సాంఘిక దురాచారాలపై అలుపెరుగని పోరాటం చేసి మహిళ విద్యాభివృద్ధికి ఫాతిమా షేక్ కృషి చేశారని ఆమె సేవలను తస్లీమా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, మహిళలు, ఆల్ అన్సార్ యూత్ మరియు మా అసోసియేషన్ సభ్యులు, తదితరులు ఉన్నారు.