టోల్గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
– ట్రాలీ వాహనాన్ని ఢీకొట్టిన స్కార్పియో
– అక్కడికక్కడే ట్రాలీ డ్రైవర్ మృతి
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటనలో ట్రాలీ డ్రైవర్ లోకిని రాజు(25) అక్కడి కక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…హన్మకొండ జిల్లా హాసన్ పర్తి మండలం బైరన్పల్లి గ్రామానికి చెందిన లోకిని తరుణ్ టాటా ట్రాలీ లో మేడారం వెళ్తున్నాడు. ఈ క్రమంలో మేడారం నుండి హన్మకొండ వైపు వస్తున్న స్కార్పియో వాహనం వెంకటాపూర్ మండలం టోల్గేట్ సమీపంలోని లింగాపూర్ క్రాస్ దగ్గరలో అతివేగంగా వచ్చి టాటా ట్రాలీ వాహనాన్ని ఢీకొనడంతో ట్రాలీ డ్రైవర్ తరుణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అదేవిధంగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంకటాపూర్ ఎస్ఐ చల్ల రాజు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులతో పాటు తరుణ్ మృతదేహాన్ని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.