ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా.. ఆగని అక్రమ మద్యం అమ్మకాలు…
తెలంగాణ జ్యోతి, రుద్రూర్ ప్రతినిధి : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా రుద్రూర్, కోటగిరి,పొతంగల్ మండలాలలో అక్రమ మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 వరకు బెల్ట్ షాపులలో మద్యం విక్రయాలు మూడు క్వాటర్లు.. ఆరు బీర్లు అన్న చందంగా మారాయి. ఇంత జరుగుతున్నా.. సంబంధిత ఎక్సైజ్ అధికారులు కనీసం తమకు ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు నెలవారీ మామూళ్లు చేస్తున్నారు కాబట్టే సైలెంట్ గా ఉంటు న్నారన్న ఆరోపనల వెనుక నిజమెంతో తెలియాల్సి ఉంది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఐదు రోజుల క్రితం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అనధికారిక మద్యం విక్రయాలు ఇంకా జోరందుకోవడం విశేషం. ఒక్కో క్వార్టర్, బీరు బాటిల్‌పై ఎమ్మార్పీ కంటే రూ.50 నుంచి రూ.60 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదంతా.. ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ బెల్ట్ షాపుల చుట్టూ పుట్టగొడుగుల్లా మద్యం ప్రియులు మద్యం విక్రయాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఈ విషయంలో ఎక్సైజ్ అధికారులు స్పందిస్తారో.. లేక తమకు ఎందుకని వదిలేస్తారో వేచి చూడాలి.