అన్ని కులాలకు సమాన హక్కులు కల్పించాలి
– జిల్లాలను యూనిట్ గా తీసుకోవాలి
– మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి
ములుగు ప్రతినిధి: ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని, జిల్లాలను యూనిట్ గా తీసుకోవాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపకులుడాక్టర్ పిడమర్తి రవి కోరారు. మాదిగల మేలుకొలుపు యాత్ర ములుగు జిల్లా కు చేరుకోగా మంగళవారం మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అంబాల మురళి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం పిడమర్తి రవి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. ఎవరి కులం ఎంత జనాభా ఉంటే వారికి అంత వాటా దక్కాలని, ఉమ్మడి రిజర్వేషన్ల ఏబీసీడీ వర్గీక రణ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మాదిగలను చైతన్యపర్చడానికి మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో మాదిగల మేలుకొలుపు యాత్రను ప్రారంభించామని పేర్కొన్నారు. 12 శాతం రిజర్వేషన్ అనే నినాదం ప్రతీ పల్లెను తాకిందని, ఈ నినాదాన్ని ఎత్తుకోకపోతే మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఎస్సీల వర్గీకరణ జిల్లాలను యూనిట్ గా తీసుకొని చేయా లని విన్నవించనున్నామని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో ముదిరాజ్, యాదవ, ముస్లింలకు ప్రాతినిధ్యం అవసరమని అభిప్రాయపడ్డారు.ఎన్నో కష్టాలకు ఓర్చి సాధించుకున్న తెలం గాణలో అత్యధిక జనాభా గలిగిన కులం అయిన మాదిగలు ఎంతో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి ధీరన్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు, టీఎండి రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల్లి మల్లికార్జున్, ఎంహెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మైస ఉపేందర్, మాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నక్క మహేష్, మాదిగ విద్యార్థి జేఏసీ కన్వీనర్ మీసాల మహేష్, ములుగు జిల్లా నాయకులు యాసం రమేష్, యాసం శీను, గజ్జల నవీన్, ఈరెల్లి ప్రదీప్, తోకల అంజి, కారపాటి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.