ప్లాస్టిక్ వాడకు.! ప్రాణాలు తీయకు.!!
– కాటారం పంచాయతీ వినూత్న ప్రచారం
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: స్వచ్ఛత హి సేవ పక్షోత్సవాలలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రమైన కాటారం గ్రామపంచాయతీ వినూత్న రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ కార్యక్రమాల తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. కాటారం మండల పంచాయతీ అధికారి వీరస్వామి, కాటారం గ్రామ పంచాయతీ కార్యదర్శి షఘీర్ ఖాన్లు ఇరువురు కలిసి నిత్యం నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. దీంతో కాటారం గ్రామ పంచాయతీలో స్వచ్ఛతాహి కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. సోమవారం గారేపల్లి పట్టణ ప్రధాన కూడలిలలో ఒక భూతం అవతారంలో నిలువెల్లా ప్లాస్టిక్ బాటిల్లను మెడలో వేసుకొని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకు ! ప్రాణాలు తీయకు !! అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వద్దు, చేతి సంచులు ముద్దు.. ప్లకార్డులను చేత బూని ప్రచారాన్ని నిర్వహించారు. ఇంతకు ముందు పలు దుకాణాలలో, చికెన్ సెంటర్లలో పాలిథిన్ కవర్ల ను నిషేధం విధిస్తూ నోటీసు బోర్డులను ప్రదర్శన చేశారు. నిబంధనలను అతిక్రమించిన ఎడల 500 నుంచి 2 వేల రూ. వరకు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో, ఇప్పటికే కాటారం మండలం లో ప్లాస్టిక్ వాడకం తగ్గిపోయింది. కాటారం గ్రామ పంచాయ తీ నిర్వహిస్తున్న విస్తృత అవగాహన కార్యక్రమాలు ఇటు ప్రజలను, అటు అధికార యంత్రాంగాన్ని ఆకర్షిస్తున్నాయి. ప్రజల కోసం పాటుపడే అధికారులు ఇలాగే కలకాలం ఉండాలని గారేపల్లి ప్రజలు కోరుకుంటున్నారు.