సరస్వతీ పుష్కరాల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం, తెలంగాణ జ్యోతి : కాళేశ్వరంలో పుష్కర పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలలో ఏకైక త్రివేణి సంగమం, దేశంలో రెండో ప్రాంతం అయిన కాళేశ్వర క్షేత్రం అద్భుతమైన ఘట్టానికి వేదిక కాబోతోంది. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించే త్రివేణిసంగమం అయిన కాళేశ్వరం లో అంగరంగ వైభవంగా పుష్కరాలు నిర్వహించుటకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15న అట్టహాసంగా ప్రాంరంభం కానున్న సరస్వతి నది పుష్కరాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే ఏర్పాట్లు పరిశీలించారు.ప్రతిరోజు కాశీ పీఠాధిపతులచే నదిహారతి కార్యక్ర మాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. ప్రతి రోజు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ 15వ తేదీన రాష్ట్రముఖ్యమంత్రి సరస్వతి మాత విగ్రహం ఆవిష్కరించడంతో పాటు గోదావరి హరతి, త్రిలింగ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని తెలిపారు. ప్రపంచంలో యముడు, శివుడు లింగాకరంలో వెలిసిన ఏకైక క్షేత్రం త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో సాక్షాత్కరిస్తుండడం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకతని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సరస్వతి పుష్కరాలకు అత్యంత అరుదైన చరిత ఉందని తెలిపారు. కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కర వేడుకులు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో సకల సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నా మని తెలిపారు. పనులు సకాలంలో పూర్తి చేయించేందుకు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని, అధికారులు స్థానికంగా ఉండి కేటాయించిన విధుల్లో నిమగ్నం కావాలని తెలిపారు. 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ను పురస్కరించుకుని జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా కాళేశ్వరంలో ఏర్పాట్లలో నిమగ్నం కావాలని సూచించారు. పుష్కరాలు నిర్వహించనున్న 12 రోజుల పాటు భక్తులకు సేవలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా అందు బాటులో ఉండే విధంగా ప్రణాళికలు చేశామన్నారు. జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.