పుష్కరాలలో భక్తుల సౌకర్యాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
కాటారం, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న సరస్వతి నది పుష్కరాలను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కరేలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేయడంలో తలమునకలయ్యారు. గత పది రోజులుగా కాలేశ్వరంలోనే మాకు వేసి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు నిర్వహించారు. వర్షాలు కురవడం రోడ్లన్నీ బురద మాయమవడంతో చాలెంజిగా తీసుకొని రజవుగా పుష్కర స్నానాలు జరిగేలా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ జామ్ లేనప్పుడు ఇద్దరు జంట కవుల లాగా కాలినడకన లేదా మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తూ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. సరస్వతి పుష్కరాలు 10వ రోజు భక్తుల రద్దీతో సందడి సరస్వతి నదీ పుష్కరాలు కొనసాగుతున్న నేపథ్యంలో కాళేశ్వరంలో సరస్వతి పుష్కర ఘాట్ లో శనివారం ఉదయం నుండే భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ రోజు ఉదయం నుంచే వేలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం ఘాట్ కు తరలి వస్తున్నారు.ప్రభుత్వం తరఫున పుష్కర స్నానాల కోసం భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శుద్ధమైన నీటి సరఫరా, వైద్య సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు తదితర కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి.కిరణ్ ఖరే నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తున్నారు. రద్దీ నియంత్రణ చర్యల్లో భాగంగా తాత్కాలిక బస్ స్టాండ్, పార్కింగ్ ప్రదేశాల నుండి భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. పోలీస్ శాఖ, రెవెన్యూ, పంచాయతీ, ఆరోగ్య శాఖలు, ఆర్ డబ్ల్యూఎస్, దేవస్థానం తదితర అన్ని శాఖల అధికారులు సమన్వయంతో యంత్రాంగం పూర్తి స్థాయిలో భక్తులకు సౌకర్యాలు కల్పనలో నిమగ్నమయ్యారు. ఉదయం నుండి భక్తుల రద్దీ కొనసాగుతున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సౌకర్యాలు పర్యవేక్షణ చేస్తూ వాకి టాకీ ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడక్కడా రహదారులు బురదమయం కాగా ఎలాంటి ఇబ్బంది పడకుండా పీఆర్ ఇంజినీరింగ్ శాఖ ద్వారా స్టోన్ డస్ట్ వేయాలన్న ఆదేశాల సిబ్బంది స్టోన్ డస్ట్ వేస్తున్నారు.
పుష్కర భక్తులకు ప్రభుత్వ సూచనలు
పుష్కర స్నానాలకు కాళేశ్వరం వస్తున్న భక్తులు జిల్లా యంత్రాంగపు సూచనలు, సలహాలు పాటించాలి. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు ఎక్కువ రద్దీ సమయాల్లో పుణ్యస్నానాలు చేయు సందర్భంలో అప్రమత్తంగా ఉండాలి. భక్తులు బారికేడింగ్ దాటి త్రివేణి సంగమంలోకి వెళ్ళకూడదు.నిర్దేశించిన ప్రాంతంలోనే భక్తులు పుష్కర స్నానాలు ఆచరించాలి.ఏదేని అస్వస్థతకు గురైతే తక్షణమే సమీపంలోని వైద్య కేంద్రంలో వైద్య సేవలు తీసుకో వాలి. వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే అవకాశముండటంతో ఉచిత రవాణా సేవలు వినియో గించుకుని భక్తులు ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలి. సురక్షిత పుష్కర స్నానాలు ఆచరించి సరస్వతి అమ్మవారి దీవెనలు పొందాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విజ్ఞప్తి చేశారు.
సరస్వతి పుష్కరాల సందర్భంగా మత్స్యశాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు
సరస్వతి పుష్కరాలను పురస్కరించుకుని త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద భక్తుల రద్దీ భారీగా ఉన్న నేపథ్యంలో, భక్తులు ఎలాంటి ప్రమాద బారిన పడకుండా మత్స్యశాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మెయిన్ ఘాట్ మరియు సరస్వతి ఘాట్‌ల వద్ద రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహణకు 50 మంది గజ ఈతగాళ్లు, 15 మంది మత్స్యశాఖ సిబ్బందిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నియమించారు. భద్రత కోసం మూడు మర పడవలు, లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్ (రింగులు) వంటి అవసరమైన రక్షణ సామాగ్రి అందుబాటులో ఉంచారు. గజఈతగాళ్లు నది నీటిలో నిరంతరం పహారా కాస్తూ భక్తుల సురక్షిత స్నానానికి పటిష్టంగా సహకరిస్తున్నారు. ప్రత్యేకంగా భక్తులు పుష్కర స్నానాలు చేయు సందర్భంలో ఏర్పాటు చేసిన బారికేడింగ్ దాటి రాకుండా సంగమంలో గజ ఈతగాళ్ళు పహారా పర్యవేక్షణ కొనసాగుతోంది. నీటిలో ఆడుకునే పిల్లలు, వృద్ధులు వంటి వారి రక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నిరంతర పర్యవేక్షణకు భూపాలపల్లి, మంచిర్యాల మత్స్యశాఖ అధికారులు విజయ్ కుమార్, అవినాష్ లను నియమించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
భక్తులకు మత్స్యశాఖ విజ్ఞప్తి
భక్తులు నదిలో దిగేటప్పుడు అధికారుల సూచనలు పాటించాలి. రక్షణ చర్యలకు సహకరించి, ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో సమీప గజ ఈతగాళ్లను సంప్రదించాలి. భద్రతే మొదటి ప్రాధాన్యత. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వ్యవహరించి, ఈ పుణ్యకాలాన్ని సురక్షిత పుష్కర స్నానం ఆచరించాలని సూచించారు.