మేడారం జాతర భక్తులకు ఉచిత మాస్కుల పంపిణీ
మేడారం బృందం : మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు దుమ్ము ధూళి వల్ల రోగాలు వ్యాపించకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మరియు మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టి.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సి) ద్వారా ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టి జాతర లోని భక్తులకు రోడ్లపై ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్నారు. మేడారం జాతరకు ఇప్పటి వరకు ఉచితంగా 15 లక్షల మాస్కులను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మరియు మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టి.ఎస్.ఎం.ఎస్. ఐ.డి.సి) ద్వారా జాతర మెడికల్ క్యాంపులకు అందించారు. రాష్ట్ర మంత్రి దనసరి సీతక్క జాతర ఏర్పాట్ల సమీక్ష సందర్భంలో హెల్త్ సెక్రెటరీ, క్రిస్టియాన, టి.ఎస్.ఎం.ఎస్. ఐ.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.వి. కర్నన్ సమక్షంలో జాతరలో పాల్గొంటున్న పారిశుధ్య సిబ్బందితో పాటు పోలీస్ శాఖ వివిధ శాఖల సిబ్బందికి ప్రజల సౌకర్యార్థం మాస్కులను ఎక్కువ మొత్తంలో సమకూర్చుకోవాలని ఆదేశించారు. వెంటనే స్పందించిన ఎం.డి. ఆర్.వి. కర్నన్,టి.ఎస్.ఎం. ఎస్.ఐ.డి. అధికారులను అప్రమత్తం చేసారు. ఈ మేరకు పలువురు ఫార్మ స్కూటికల్ తయారీదారులు స్వచ్చందంగా టి.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సికి విరాళంగా 15లక్షల మాస్కులను సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ద్వారా జాతర వినియోగం కోసం అందిస్తున్నారు.