ఆదివాసీ నాయకులతో ధరణి పోర్టల్ కమిటీ చర్చలు జరపాలి.
– మానవ హక్కుల వేదిక ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ దాగం ఆదినారాయణ.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : మానవ హక్కుల వేదిక ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ దాగం ఆదినారాయణ సోమవారం ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఆర్ .అండ్. బి విశ్రాంతి భవనం ఆవరణలో సమావేశం నిర్వహించారు. మానవ హక్కుల వేదిక ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ దగం ఆదినారాయణ మాట్లాడుతూ, ఆదివాసి సంఘ నాయకులతో ధరణి పోర్టల్ కమిటీ వెంటనే చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు .ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఆది వాసీలకు ప్రత్యేకంగా రూపొందించబడిన 1/70 పిసా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను అధికారులు అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో ఆదివాసీల భూములను లాక్కున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్ వ్యవస్థ పేరుతో ఆదివాసీల భూములను మొత్తం కూడా వలస గిరిజనేతరుల చేతిలోకి వెళ్లిపోయారని ఆయన అన్నారు. ఐదవ షెడ్యూలు భూభాగం లోకి, 1/70 చట్టానికి విరుద్ధంగా వలస గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలోకి వస్తు న్నారని ఆదివాసీల భూములను దౌర్జన్యంగా, ధరణి పోర్టల్ లో పట్టాలు పొందారని ఆయన ఆరోపించారు.బడా బాబులు రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపించి,గిరిజనేతరుల పేర్లను నమోదు చేస్తున్నారని అలాంటి ధరణి వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెసా చట్టం ప్రకారంగా, ఆదివాసీలదే రాజ్యాధికారం అని ఆదివాసులకు స్వయం పరిపాలన ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసి సంఘం నాయకులతో ధరణి కమిటీ చర్చలు జరపాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర ,తాటి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.