Redco chairman | సంక్షేమాన్ని ఆపే కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
- లబ్దిదారులు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి
- ప్రజలు తిరగబడాల్సిన సందర్భం వచ్చింది
- రాష్ట్ర రైతులకు కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలి
- బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి
- ఆసరా ఫించన్లను రద్దు చేయాలంటున్న కాంగ్రెస్
- రాష్ట్ర దివ్యాంగుల కార్పోరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
- ఓటమి భయంతోనే సంక్షేమ పథకాలపై ఫిర్యాదు
- రాష్ట్ర రెడ్కో చైర్మన్ ఏరువ సతీష్‌రెడ్డి
ములుగు ప్రతినిధి : కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ది కార్యక్రమాలను చేపట్టి రాష్ట్ర సంపదను పెంచి ప్రజల బాగోగుల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి దిక్సూచిగా అమలు చేస్తున్నారని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నో ఏళ్ల నుండి నడుస్తున్న పథకాలను ఆపే కుట్రలను కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని జడ్పీచైర్‌పర్సన్, ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలను నిలుపుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సందర్భంగా గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పట్టణ కార్యాలయంలో రాష్ట్ర రెడ్కో చైర్మన్ ఏరువ సతీష్‌రెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల కార్పోరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, ములుగు జిల్లా బీఆర్ఎస్ నాయకులతో కలిసి నాగజ్యోతి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు దిక్కు తోచక కుట్రలకు పాల్పడుతూ సంక్షేమ పథకాలను ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80శాతం మంది రైతులు ఉన్నారని, వారందరికి రైతు బంధును ఆపాలని అనడం కాంగ్రెస్ నాయకుల అవివేకానికి నిదర్శనమని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సహాయంగా అందించే రైతు బంధు, యాసంగి సీజన్లో ప్రతీ సంవత్సరం లాగే అందుతుందని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకుల రీతి రైతు బంధుకు రామ్, రామ్, 24గంటలకు చెక్ పెట్టే రీతిలో ఉందని అన్నారు. బీడు భూముల తెలంగాణను సస్యశ్యామలం చేసి రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తుంటే కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాక ముందే రైతులకు కష్టాలు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ప్రజల కష్టాలు తీరినై అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ పుణ్యమేనని అన్నారు. రైతులంతా పార్టీలంతా పార్టీలకు అతీతంగా ఆలోచించి కాంగ్రెస్ నాయకుల కుట్రలను గమనించాలని అన్నారు. పోడు భూములకు పట్టాలు అందించి వారికి కూడా రైతు బంధు పథకాన్ని వర్తింపజేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. సంక్షేమాన్ని అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కావాలో కరువును తెచ్చే కాంగ్రెస్ నాయకుల పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. ప్రశ్నించే గొంతునని స్టేజీల మీద చెప్పుకునే ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ నాయకులు విధానాన్ని ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం లేదంటున్న కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సందర్భంగా సంక్షేమ పథకాలనే ఆపుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యే సీతక్కకు రైతుల పట్ల చిత్తశుద్ది ఉంటే రైతులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు. పార్టీలకు అతీతంగా వర్తింపజేస్తున్న రైతు బంధు పథకం లబ్దిదారులంతా ఏక తాటిపైకి వచ్చి రైతులకు వెన్నంటి నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని నాగజ్యోతి అన్నారు.
ఆసరా ఫించన్లను రద్దు చేయాలంటున్న కాంగ్రెస్
- రాష్ట్ర దివ్యాంగుల కార్పోరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
50ఏళ్ళుగా రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటీల రాజకీయాలు ఎన్నికల సందర్భంగా సంక్షేమ పథకాలను ఆపాలనే వారి నైజం మరో సారి బయట పడిందని, అందులో భాగంగానే సంక్షేమ పథకాలైన ఆసరా ఫించన్లను కూడా రద్దు చేయాలంటున్నారని రాష్ట్ర దివ్యాంగుల కార్పోరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. రైతులకు 24గంటల కరెంట్ అవసరం లేదన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3గంటల కరెంట్ ఇస్తారని అన్నారని తెలిపారు. 2018లో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంతో పాటు దళిత బంధు పథకాన్ని కూడా ఆపాలని అనడం కాంగ్రెస్ నాయకుల ఓటమి భయానికి నిదర్శనమని అన్నారు. సంక్షేమ పథకాలను ఆపాలని ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు ఆ ఫిర్యాదును వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో 46లక్షల మందికి ఆసరా ఫించన్లు అందుతున్నాయని, ప్రజల బాగోగులు ఏ నాడు పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అందుతున్న పథకాలను కూడా ఆపాలని అంటున్నారు. తెలంగాణ ప్రజలు కుట్రలను గమనించి కాంగ్రెస్ వైఖరిపై నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమ పథకాలపై కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అవసరమా అనేది ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు.
ఓటమి భయంతోనే సంక్షేమ పథకాలపై ఫిర్యాదు
- రాష్ట్ర రెడ్కో చైర్మన్ ఏరువ సతీష్‌రెడ్డి
కేసీఆర్ భరోసా పేరుతో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ విడుదల చేసిన ఎన్నికల మానిఫెస్టో సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు అవుతాయని తెలుసుకొని ఓటమి భయంతోనే సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ అగ్ర నాయకులు ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారని రాష్ట్ర రెడ్కో చైర్మన్ ఏరువ సతీష్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్‌ను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు కుటిల రాజకీయాలకు తెర లేపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 10 సీట్లు కూడా గెలువలేమనే పరిస్థితిని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు ఈ పనులు చేస్తున్నారని అన్నారు. కోడ్ నిబంధనలతో సంక్షేమ పథకాలకు అడ్డం పడే కాంగ్రెస్ నాయకులు తిరిగి ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను ఇవ్వలేకపోతుందని ప్రచారం చేసే కుట్రలకు తెరలేపారని అన్నారు. ఆన్‌గోయింగ్ పథకాలను ఆపే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకుల విధానాలను ప్రజలు గమనించాలని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికల సందర్భంగా ఆన్‌గోయింగ్ పథకాలను ఆపలేదన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గమనించాలని తెలిపారు. రైతు బంధు ఆపుతున్న రాబంధులు, దళితబంధు వద్దంటున్న రాక్షసులు కాంగ్రెస్ నాయకులని సతీష్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు పాలిస్తున్న కర్ణాటకలో రైతులు రొడ్డెక్కిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని అన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలను వద్దంటున్న కాంగ్రెస్ నాయకులు రేపు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను చెప్పులతో కొట్టి నిలదీయాలని అన్నారు. ప్రజలు ఆగం కావద్దనేదే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, రానున్న ఎన్నికల సందర్భంగా ములుగు నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యే సీతక్క చేస్తున్న కుట్రలకు చెరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెస్ నాయకుల కుట్రలను తెలిపే ప్లేకార్డులను ప్రదర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్‌యాదవ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, నాయకులు పోరిక ధరమ్‌సింగ్, భూక్య దేవ్‌సింగ్, వెల్పూరి సత్యనారాయణరావు, బేతెల్లి గోపాల్‌రెడ్డి, గజ్జి నగేష్, కాకి పురుషోత్తం, భూక్య మురళీ, ఆదిరెడ్డి, శరత్ తదితరులు ఉన్నారు.
1 thought on “Redco chairman | సంక్షేమాన్ని ఆపే కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు”