దేశ మూల వాసుల పైన వలస వాదుల దాడి
– అత్యంత హేయమైన చర్య.
– ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించి ఆదివాసీ మహిళలకు రక్షణ కల్పించాలంటూ ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో శనివారం ఏఎన్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నరసింహమూర్తి ఆధ్వర్యంలో కొమరం భీమ్ విగ్రహానికి ఆదివాసీ వీర మహి ళలు పూల మాలలు వేసి ర్యాలీగా బయలుదేరి, అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి మానవ హారం నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ గా వెళ్లి ఏ ఎస్సై రామచందర్ నాయక్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. షేక్ ముగ్దూం పైన కేసు నమోదు చేయాలని కోరారు. ఆదివాసీ గూడెల్లో మహిళలకు రక్షణ కరువైందని, మహిళపై దాడి జరిగిన వారం రోజుల తర్వాత జైనూర్లో ఘర్షణ జరిగితే ప్రభుత్వం అమాయకులు అయిన ఆదివాసీల పైన కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ మహిళల పైన ఇలాంటి పైశాసిక ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ దేశ మూలవాసుల పైన ముప్పేట దాడులు జరుగుతున్నాయని ,ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి ఎటువంటి హాని చేయని ఆదివాసీల పైన దాడులు జరుగుతూ ఉండడం దుర్దృష్ట కరం అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా లోని చెంచు తెగకు చెందిన ఆదివాసీ మహిళను వారం రోజుల పాటు హత్యాచారం చేసి ఆమె రహస్య ప్రదేశాలలో గాయాలు చేశారని అన్నారు. ఈశ్వరమ్మ పైన హత్యాచారం చేసి దాడులు చేసిన దోషుల జాడ లేదన్నారు. తొమ్మిది నెలల పాలనలో 1900 వందల కేసులు రాష్ట్రంలో నమోదు కావడం దిగ్భ్రాంతి గురి చేస్తోందన్నారు. ఈ దేశంలో జంతువులకు ఉన్న విలువ ఆదివాసీలకు లేదన్నారు. మహారాష్ట్ర లోని నంద భాయి అనే బిల్లు తెగకు చెందిన ఆదివాసీ మహిళను గిరిజనేతరుడు అత్యాచారం చేసిన కేసులో దేశ అత్యున్నత న్యాయ స్థానం ,ఈ దేశ మూల వాసుల పైన దాడి చేస్తే సహించేది లేదని చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ దేశానికి వలస వచ్చిన గిరిజనేతరులు మూల వాసుల పైన దాడులు చేయడం హేమైన చర్య అని కోర్టు స్పష్టం చేసిందన్నారు. నేడు గిరిజన ప్రాంతాల్లోకి వచ్చిన వలస గిరిజనేతరుల కారణంగానే ఆదివాసీల ఉనికికి ప్రమాదం సంభవిస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న అక్రమ వలస దారులను ప్రభుత్వం తక్షణమే పంపించాలని .షెడ్యూల్డు ప్రాంతాల్లో ఆదివాసీల మాన,ప్రాణాలకు ఎటువంటి రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఆదివాసీల పైన వలస గిరిజనే తరుల మూక దాడులు అనేకం జరిగే అవకాశం ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతున్న వలస గిరిజ నేతరుల నుండి ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జైనూరు ఘటనలో ఆదివాసీ మహిళకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. దేశం లో ఇలాంటి ఘటనలు ఉన్నత వర్గాల వారికి జరిగితే బుద్ది జీవులు, స్వచ్ఛంద సేవా సంస్థలు తీవ్రంగా ఖండించే వారని అన్నారు. ఆదివాసీ మహిళా కాబ ట్టే పైన తెల్పిన వర్గాల వారు స్పందించ లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో మణిపూర్ లాంటి ఘటనలు అనేకం జరిగే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో మండలం లోని మహిళలు భారీగా పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మోడెం నాగరాజు, మడకం రవి, రాజేష్, మహేష్, యెట్టి ఝాన్సి, నారాయణమ్మ, సురేందర్, మంతయ్య తదితరులు పాల్గొన్నారు.