Cm Revanth Reddy | మేం పాలకులం కాదు.. సేవకులం…

Written by telangana jyothi

Published on:

Cm Revanth Reddy | మేం పాలకులం కాదు.. సేవకులం…

– ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం

– శుక్రవారం ప్రజాదర్బార్‌..సీఎంగా రేవంత్‌ రెడ్డి తొలి ప్రసంగం

– తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌, తెలంగాణ జ్యోతి : తెలంగాణ నూతన ముఖ్య మంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. తొలుత సీఎంగా రేవంత్‌రెడ్డి ఆ తర్వాత మంత్రులతో గవర్నర్‌ ప్రమాణం చేయించారు.రేవంత్‌తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ సీఎంగా ఆరు గ్యారంటీల తొలిఫైల్‌పై రేవంత్‌ సంతకం చేశారు. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రంపై సీఎం అందజే శారు.డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క మంత్రులుగా ఉ‍త్తమ్‌ కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌,కొండా సురేఖ, డి. అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక తో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు ఇవాళే స్వేచ్ఛ లభించిందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి తొలిసారి ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటుతో ఇక అంతటా సమానాభివృద్ధి సాధ్యం. తెలంగాణ ఆషామాషీగా ఏర్ప డిన రాష్ట్రం కాదు. పోరాటాలతో త్యాగాలే పునాదులుగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. పదేళ్లుగా నిరంకుశత్వాన్ని రాష్ట్ర ప్రజలు మౌనంగా భరించారు. ఇప్పటికే ప్రగతిభవన్‌ ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించాం. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చుదిద్దుతాం. శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తాం. మీ బిడ్డగా.. మీ సోదరుడిగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. మేం పాలకులం కాదు.. మీ సేవకులం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా. పదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటా. విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now