మానవత్వం చాటుకున్న కాటారం సిఐ నాగార్జున రావు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: మానవతా దృక్పథం పరిఢవిల్లిన పోలీస్ అధికారి. ఆయనే కాటారం సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఈవూరి నాగార్జున రావు. వివరాల్లోకి వెళితే శుక్రవారం విధి నిర్వహణలో భాగంగా కాటారం నుంచి మహాదేవపూర్ కు సిఐ నాగార్జున రావు తన వాహనంలో వెళ్తుండగా మార్గమధ్యంలో ఒకరు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని గమనించారు. దాంతో తన వాహనాన్ని ఆపి గాయాల పాలైన సదరు బాధితుడుని తన వాహనంలోకి ఎక్కించుకొని మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి స్వయంగా తీసుకొని వెళ్లి సీ ఐ నాగార్జున రావు వైద్య చికిత్సలు చేయించారు. మహాదేవపూర్ మండలంకు చెందిన అంగజాల శ్రీకాంత్ కాటారం నుంచి పనులు ముగించుకొని మహాదేవపూర్ కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రోడ్డుకు అడ్డుగా గొర్లు రావడంతో వాటిని తప్పించబోయి, అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి కావడంతో రోడ్డు ప్రక్కన ఉన్న బాధితుడు శ్రీకాంత్ ను గుర్తించి సీ ఐ నాగార్జున రావు మానవతా దృక్పథంతో ప్రాథమిక చికిత్స చేయించారు. బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్వయంగా దగ్గరుండి క్షతగాత్రుడికి వైద్య చికిత్సలు చేయించిన కాటారం సిఐ నాగార్జున రావును పలువురు ప్రశంసలు తెలియజేశారు. సిఐ నాగార్జున రావు కు బాధితుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.