నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

Written by telangana jyothi

Published on:

నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి,

– భూపాలపల్లి ఎస్పి కిరణ్ ఖరే

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, వీటితో నేరాలను కట్టడి చేయవచ్చని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఐ పీ ఎస్ అన్నారు. శుక్రవారం మొగుళ్లపల్లి మండలం రంగాపూర్ లో గ్రామస్తులు, దాతల సహకారంతో సుమారు రూ. 5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 50 సీసీ కెమెరాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి ఎస్పి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ  శాంతి భద్రతలు ఎక్కడైతే పటిష్టంగా ఉంటాయో, అక్కడే అభివృద్ధి సాధ్యమని, ప్రజల రక్షణ, భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పని చేస్తున్నా రన్నారని ఎస్పి పేర్కొన్నారు. సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని తెలిపారు. సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చని, నేరస్థులు సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశాలలో నేరం చేసేందుకు వెనుకడుగు వేస్తారని తెలిపారు. పటిష్టమైన సీసీ కెమెరాల రక్షణ వ్యవస్థ ఉండడం తో ప్రజల్లో భరోసా ఉంటుందన్నారు. దొంగతనాలు, ఇతర నేరాలను అలాగే రోడ్డు ప్రమాదాలు, నిందితులను అరెస్టు చేయడంలో కెమెరాలు సహాయపడతాయని, ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ తమ గ్రామాల్లో ఉంటే పోలీసు అధికారులకు తెలియజేయాలని ఎస్పి కిరణ్ ఖరే సూచించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ రoగాపూర్ గ్రామస్తు లు, దాతలు, రూ.5 లక్షలతో సీసీ కెమెరాలను భద్రత కోసం ఏర్పాటు చేయడం అందరికి ఆదర్శనీయమన్నారు. అన్ని గ్రామాల ప్రజలు ఇలాగే సీసీ టీవీ కెమెరాలను అమర్చు కోవాలని కోరారు. నేరాల నివారణతో పాటు కేసుల గుర్తింపు లో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని, నేరాలను అదుపు చేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారస్తులు, స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు, చిట్యాల సీఐ మల్లేష్ , మొగుళ్ళపల్లి ఎస్సై అశోక్ కుమార్, రంగాపూర్ గ్రామ ప్రజాప్రతినిధులు, సీసీ కెమెరాల దాతలు బల్గురి సంతోష్ రావు, లింగరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment