ములుగులో కారు ప్రమాదం.. ఇద్దరికీ గాయాలు
– పాదచారులపైకి దూసుకెళ్లిన కారు..
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం కారు జనాలపైకి దూసుకెళ్లింది. ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టి రోడ్డుపక్కనే ఉన్న పండ్లబండిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, పండ్ల బండి సైతం ధ్వంసమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగాలపల్లి వైపు నుంచి హన్మకొండకు టీఎస్ 03 ఎఫ్ఎఫ్ 0759 నెంబరుగల వోక్స్ వ్యాగన్ కారు ములుగు లోని బస్టాండ్ దాటగానే అదుపుతప్పి రోడ్డుపక్కనే నడుచు కుంటూ వెళ్తున్న రాము, మోహన్ లను ఢీకొట్టింది. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ఉన్న పండ్లబండిని ఢీకొట్టి నిలిచింది. ఈ ప్రమాదంలో అయ్యప్ప మాల ధరించి ఉన్న మోహన్ కాలు విరుగగా రాముకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. పండ్లు బండి వద్ద ఉన్న మహిళా వ్యాపారి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ములుగు ఎస్సై బండి రామకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. కాగా, కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు.