ఆంధ్రలో కారు ప్రమాదం.. గ్యాసు సారయ్య మృతి…
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహాదేవపూర్ గిరిజన సహకార సంస్థ ఆధీనంలో గల హెచ్ పి గ్యాస్ గోదాం ఆఫీసర్ గా పనిచేసిన సారయ్య ఆంధ్రాలో జరిగిన కారు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం తన కుమారుడు, కోడలు, ఇద్దరు చిన్నారులతో కలిసి కారులో తిరుపతి, చెన్నైకు బయలు దేరారు. కాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదుర్తి మండలంలోని 16వ జాతీయ రహదారి పైన కుక్క అడ్డు రావడంతో రోడ్డుకు పక్కలో గల బ్రిడ్జి రెయిలింగ్ కు కారు ఢీకొని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కింసారపు సారయ్య (70) అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న సారయ్య కొడుకు, కోడలు, చిన్నారులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ఆసుపత్రికి తరలించారు. కాగా దగధుర్తి ఎస్సై జంపాన కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కింసారపు సారయ్య స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామం, కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో గల గిరిజన సహకార సంస్థ ఆధీనంలో నిర్వహిస్తున్న హిందూస్తాన్ పెట్రో లియం ఎల్పిజి గ్యాస్ గోడౌన్ ఆఫీసర్ గా గత దశాబ్దం కిందట సారయ్య విధులు నిర్వహించారు. మహాదేవపూర్ లోనే ఆయన పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయన స్వగ్రామం ఉప్పల్ లో నివాసం ఉంటున్నారు. గత వేసవి కాలం లో సారయ్య భార్య మృతి చెందారు. కాగా సారయ్య కు వివాహితులైన కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సారయ్య ఆంధ్రలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందాడనే సమాచారం తెలియడంతో మహాదేవపూర్ జిసిసి కార్యాలయం సిబ్బంది దిగ్భ్రాంతి చెందారు. మహాదేవపూర్, కాళేశ్వరం, పలిమల, కాటారం, మహాముత్తారం, మలహర్ మండలాలలో “గ్యాస్ సారయ్య ” గా పేరు గడించారు. సారయ్య మృతి చెందాడని సమాచారం తెలియడంతో ఈ ప్రాంతవాసులు శోకసముద్రంలో మునిగిపోయారు.