పదేళ్లలో అవినీతి మచ్చలేని బీజేపీ ప్రభుత్వం.
– బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా మోదీ పనిచేశారు
– బీజేపీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్
– దేశం కోసం మరోసారి మోదీ రావాలి : బీజేపీ మాజీ ఎమ్మెల్యే, క్లస్టర్ ఇన్చార్జి ధర్మారావు
– ములుగులో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం
ములుగు, తెలంగాణ జ్యోతి : కేంద్రంలోని ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కుంభకోణాలు, అవినీతి మచ్చలేని పాలన కొనసాగించారని, పదేళ్లో బడగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారని మాజీ ఎంపీ, మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ అన్నారు. దేశహితం కోసం ఎన్నో గట్టి నిర్ణయాలు తీసుకున్న మహనీయుడని కొనియాడారు. శుక్రవారం ములుగులోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరుగింది. ఎంపీ అభ్యర్థితో పాటు క్లస్టర్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
– సుపరిపాలన కావాలంటే మరోసారి మోదీ రావాలి : ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్
దేశం సుభిక్షంగా ఉండాలన్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ అనగారిన వర్గాల అభివృద్ధి జరగాలన్నా మరోసారి కేంద్రంలో మోదీ రావాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ అన్నారు. 2014నుంచి 2024వరకు పదేళ్ల బీజేపీ పాలనపై ప్రతిపక్షం అవినీతి ఆరోపణలు చేయలేని సుపరిపాలన సాగించారన్నారు. ప్రధాని మోదీ కారణజన్ముడని, ఆ పరమాత్ముడు శ్రీరాముని అంశతోనే దేశంలో మంచి మార్పులు సాధ్యమ య్యాయన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ లో ఈసారి బీజేపీ గెలుపు ఖాయమన్నారు. ఈసారి జరిగే ఎన్నికలు కేవలం మోదీ ఎన్నికలేనని సష్టం చేశారు. 500ల ఏళ్లు పెండింగ్ లో ఉన్న అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తయిందని, 370ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు తదితర చారిత్రక నిర్ణయాలతో ప్రధాని మోదీ దేశ ప్రజలకు భరోసాగా నిలిచారన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపిన ఘనుడు మోదీ అని, కరోనా కష్టకాలంలో ప్రపంచానికి వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేసిన గొప్ప నేత అన్నారు. ములుగు మండలం వెంకటాపూర్ బిడ్డగా మీముందుకు వస్తున్నానని, తాను ప్రొఫెసర్ గా చెప్పిందే చేశానన్నారు. ప్రపంచ గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయనికి యునెస్కో గుర్తింపు, సమ్మక్క, సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం కోసం తాను కృషి చేశానని, బీజేపీ అమలు చేసిందన్నారు. ములుగు ప్రాంతానికి కేంద్రీయ విశ్వవిద్యాలయం, పాలిటెక్నిక్ విద్యాసంస్థల ఏర్పాటు పత్రాలు తీసుకొచ్చినా పట్టించుకున్న పాలకులు లేరన్నారు. దేశంలో శ్రీరామున్ని కొలవని కుటుంబ ఉండదని, ఆ శ్రీరాముని కృపతో మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
– మోదీ పేదల మనిషి : మాజీ ఎమ్మెల్యే ధర్మారావు
కేంద్రంలో ప్రధాని మోదీని మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, మోదీ పేదల మనిషి అని మాజీ ఎమ్మెల్యే, క్లస్టర్ ఇన్చార్జి మార్తినేని ధర్మారావు అన్నారు. ములుగు నియోజకవర్గంలో 303పోలింగ్ బూతులు ఉన్నాయని, ప్రస్తుతం బీజేపీ 303సీట్లు గెలిచిందని, వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించుకోవాలన్నారు. 400లకు పైగా స్థానాలను గెలిపించుకొని సుపరిపాలనకోసం కృషి చేయాలన్నారు. పదేళ్లలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీని అనే అవకాశం కూడా ఇవ్వకుండా నిజాయితీగా పరిపాలన చేశారన్నారు. కుటుం బం, అన్నాదమ్ములు, సుపరిపాలన అంటే శ్రీరాముని చూసి నేర్చుకోవాలని, బీజేపీ ముమ్మాటికి అలాంటి ఆదర్శాలతో ముందుకు వెళ్తోందన్నారు. కాంగ్రెస్ అంటేనే కుటుంబ పార్టీ అని, ప్రాంతీయ పార్టీలనె పెంచిపోషించి వ్యవస్థను నాశనం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. గుజరాత్ అభివృద్ధి చూసి ప్రదాని మోదీని దేశ ప్రజలు కోరుకున్నారని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా యువత, మహిళలు మోదీని గెలిపించుకోవాలని చూస్తున్నారన్నారు. పార్లమెంటు లో మహిళలు 33శాతం రిజర్వేషన్ పెంచిన ఘనత మోదీకి దక్కుతుందన్నారు.ప్రపంచంలో 120దేశాలు పర్యటించి గొప్ప విదేశాంగ విధానాన్ని రూపొందించారన్నారు.
– క్రమశిక్షణ గల పార్టీని గెలిపించుకోండి : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి
బీజేపీ అంటేనే క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ అని, సాధారణ కార్యకర్త నుంచి ప్రధాని వరకు అందరూ సిద్ధాంతా లకు కట్టుబడి ఉంటారన్నారు. చాయ్ అమ్మిన మోదీని ప్రధానిని చేసిన ఘనత కేవలం బీజేపీకే దక్కుతుందన్నారు. కార్యర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. కష్టపడ్డ ప్రతీ ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని, పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి మోదీ నినాదంతో ముందుకు పోవాలన్నారు. మహ బూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, అజ్మీర కృష్ణవేణి నాయక్, బీజేపీ గిరిజనమోర్చ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, నాయకులు బానోతు దేవీలాల్, ప్రతాప్, అజ్మీర ప్రహ్లాద్, భూక్య రాజు నాయక్, భూక్య జవహర్ లాల్ నాయక్, బీజేపీ మండల అధ్యక్షులు కారుపోతుల యాదగిరి, మద్దినేని తేజరాజు, గాదం కుమార్, తదితరులు పాల్గొన్నారు.