వచ్చేవారం నుండి అందుబాటులోకి భారత్ రైస్ విక్రయాలు
డెస్క్ : బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ రైస్ పేర బియ్యాన్ని విక్రయించనుంది. కిలో రూ.29 చొప్పున అమ్మకాలు చేపట్టనుంది. వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా విలేకరుల సమావేశంలో శుక్రవారం వెల్లడించారు. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిన వేళ మధ్యతరగతికి ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ ధరలు 15 శాతం మేర పెరిగాయని చోప్రా అన్నారు. నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో బియ్యాన్ని విక్రయిస్తామని వెల్లడించారు. ఇ-కామర్స్ వేదికగానూ భారత్ రైస్ లభిస్తుందన్నారు. 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో ‘భారత్ రైస్’ అందుబాటులో ఉంటుందని చోప్రా తెలిపారు. రిటైల్ మార్కెట్లో తొలి దశలో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయిం చాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. ఇప్పటికే భారత్ గోధుమ పిండి కిలో రూ.27.50, భారత్ దాల్ (శనగ పప్పు)ను రూ.60 చొప్పున కేంద్రం విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తి వేస్తారంటూ వస్తున్న వార్తలపై చోప్రా స్పందించారు. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే, రిటైలర్లు, హోల్సేలర్లు, ప్రాసెసర్లు ప్రతి శుక్రవారం స్టాక్ వివరాలను మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పొందుపరచాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నిల్వలపై పరిమితి విధించబోతున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా… అవసరమైతే ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశంఉంది అని ముక్తసరిగా చెప్పారు. దేశంలో బియ్యం తప్ప మిగిలిన అన్ని నిత్యావసరాల ధరలు అదుపులో ఉన్నాయన్నారు.