దళిత బంధు నిధులు విడుదల చేయాలంటూ లబ్ధిదారుల రాస్తారోకో
కాటారం, తెలంగాణ జ్యోతి : బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాం లో దళిత బంధు పథకంలో మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయాలని లబ్ధిదారులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. శనివారం కాటారం మండలం గార పెళ్లి చౌరస్తాలో భారత రాజ్యాంగ స్తూపం ఆవిష్కరణ అనంతరం కాటారం రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన దళిత బంధు లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. ఫ్రీజింగ్ చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సుమారు గంటకు పైగా ఎండలో వేడిమిని భరిస్తూ లబ్ధిదారులు రాస్తారోకో నిర్వహించగా, ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా అధికారులు సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని రాస్తారోకో నిర్వహించారు. మహాదేవపూర్, వరంగల్, మంథని మూడు వైపులా రహదారుల లో ఆర్ టీ సి బస్సులు, లారీలు, ఆటోలు,ద్విచక్ర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సమస్య ను పోలీసులు పరిష్కారం కోసం సబ్ కలెక్టర్, తహశీల్దార్ ఉన్నతాధికారులకు తెలిపేందుకు యత్నించగా ఎవరు అందుబాటులో లేరు. పోలీసులు కొంత సేపు వేచి చూసి రాస్తారోకో చేస్తున్న దళిత బంధు లబ్దారులను బలవంతంగా విరమింపజేశారు. మహాముత్తారం, కొయ్యూరు సబ్ ఇన్స్పెక్టర్లు మహేందర్, కిషోర్ పోలీస్ బందో బస్తు నిర్వహించారు.