బహుజన యువత రాజకీయాల్లోకి రావాలి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : బహుజన యువత రాజకీయాల్లోకి రావాలని బహుజన సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జి, భద్రాచలం నియోజకవర్గం అదనపు ఇన్చార్జి తడికెల శివకుమార్ అన్నారు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధిలోగల ఆలుబాక గ్రామంలో సోమవారం బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం నియోజక వర్గం ఉపాధ్యక్షులు కుమ్మరి రాంబాబు ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. నూతన వ్యక్తుల చేరికల కోసం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శివకుమార్ మాట్లాడు తూ పార్టీలో చేరిన నాయకులకు పార్టీ యొక్క సిద్ధాంతం ప్రకారం దిశా నిర్దేశం చేశారు. బహుజన సమాజ్ పార్టీలో జనాభా దమాషా ప్రకారం అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఎవరు ఎంత జనాబో వారికి అంత అనేది బహుజన్ సమాజ్ పార్టీ నినాదంగా పేర్కొన్నారు. రాజ్యాంగమే మేనిఫెస్టోగా కలిగిన ఏకైక రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని వివరించారు. సర్వ జనహితాయ సర్వజన సుఖాయ అనేది పార్టీ సిద్ధాంతమని పునరు ద్ఘటించారు. అనంతరం ఆలుబాక గ్రామానికి చెందిన యువకులను పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నూతనంగా పార్టీలో చేరిన సొల్లేటి గణేష్, బొల్లె సతీష్, కంతి నేత్రనంద్ కుమార్, సబ్కా సాయికుమార్ లకు అభినందనలు తెలియజేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ప్రేరణతో బహుజన యువత రాజకీయాలు చేయాల్సిందేనని ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్ నియోజకవర్గ సోషల్ మీడియా ప్రతినిధి జనగం కేశవరావు తదితరులు పాల్గొన్నారు.