బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
– భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి ఐడిఓసి కార్యాలయంలో బుధవారం బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలకు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో గౌడ కులస్తులు బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడని అతని సేవలను కొనియా డారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కుల, మత, జాతి విభేదాలు లేకుండా సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. సర్వాయి పాపన్న 17వ శతాబ్దంలో బహుజన రాజుగా చరిత్రలో నిలిచారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గౌడ కులస్తుల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ కార్పోరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి శైలజ, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.