డీఎస్సీలో ములుగు జిల్లా స్థాయి మొదటి ర్యాంకు సాధించిన అరుణ్
– తండ్రి దశదినఖర్మ తెల్లారే డీఎస్పీ రాసిన యువకుడు
– ములుగు మండలం అబ్బాపురం వాసి
– అభినందనలు తెలిపిన గ్రామస్థులు
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ 2024లో ఎస్జీటీ విభాగంలో ములుగు మండలం అబ్బాపూర్ యువకుడు జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. తండ్రి డీఎస్సీ పరీక్షకు పది రోజుల ముందు చనిపోయినా ధైర్యం కోల్పోకుండా పరీక్ష రాసి లక్ష్యాన్ని సాధించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన అరుణ్ చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందుండేవాడు. వ్యవసాయంలో కుటుంబసభ్యులకు చేదోడుగా నిలుస్తూ చదువుకున్న ఆయన డీఎస్పీలో ర్యాంకు సాధించడంపట్ల హర్షం వ్యక్తమవుతోంది. ములుగు మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన మోటపోతుల రాణి ఆనందం దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు అరుణ్ ఉన్నారు. కల్లుగీత కార్మికుడిగాపనిచేసే తండ్రి ఆనందం వ్యవసాయం చేసేవాడు. పదవతరగతి ములుగులోని అరవింద స్కూల్ లో పూర్తిచేసి ఇంటర్ హన్మకొండలోని ప్రైవేటు కాలేజీలో చదివాడు. అనం తరం డీఎడ్ పూర్తి చేసిన అరుణ్ ఓపెన్ లో డిగ్రీ పూర్తి చేశాడు. కేయూలో పీజీ ఇంగ్లీష్ కూడా చదివాడు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్పీ 2024 పరీక్ష జూలై 19న జరిగింది. అయితే డీఎస్సీకి పదిరోజుల ముందే తండ్రి అనారోగ్య కారణాలతో మృతిచెందాడు. తండ్రి దశదిన ఖర్మ పూర్తయిన తెల్లారే బాధను దిగమింగుతూ అరుణ్ పరీక్షకు హాజరయ్యాడు. తల్లిదండ్రుల కళలు నిజం చేస్తూ ములుగు జిల్లాస్థాయిలో అరుణ్ మొదటి ర్యాంకు సాధించాడు. కాగా, తన తండ్రికి ఈ విజయం అంకితం ఇస్తున్నానని, వన్ ఈస్ట్ త్రీ జాబితాను ప్రభుత్వం ప్రకటించనుందని, అందులో తనకు తప్పకుండా జాబ్ వస్తుందని అరుణ్ ఆనందంతో తెలిపాడు. కాగా, తన తల్లిదండ్రులతోపాటు విద్య నేర్పిన గురువులకు కృతజ్క్షతలు తెలిపాడు. తనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకా రం ములుగు జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు వచ్చిందని, విద్యార్థులకు బోధన చేస్తూ సేవచేసే భాగ్యం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అరుణ్ పేర్కొన్నారు.