లారీని వెనకనుంచి ఢీ కొట్టిన మరో లారీ
– క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్
– అతి కష్టం మీద బయటకు తీసిన 108 సిబ్బంది
– ములుగు మండలం మల్లంపల్లి వద్ద అర్ధరాత్రి ఘటన
ములుగు ప్రతినిధి : ఇసుక లోడుతో వెళ్తున్న లారీని మరో లారీ వెనుక నుంచి ఢీ కొట్టిన సంఘటనలో డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా అతి కష్టం మీద 108 సిబ్బంది బయటకు తీసిన సంఘటన ములుగు మండలం మల్లంపల్లి కెనాల్ బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెల్లవారు జామున ఒంటిగంటకు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టీజీ 07 యూ 1149 నెంబర్ గల లారీ లో డ్రైవర్ బాలకృష్ణ ఏటూరునాగారం నుంచి ఇసుక లోడుతో ములుగు మీదుగా హైదరాబాద్ కి వెళ్తున్నాడు. మంగళవారం తెల్లవారు జామున ఒంటి గంటకు మల్లంపల్లి కెనాల్ బ్రిడ్జి వద్దకు చేరుకోగా ముందు వెళ్తున్న లారీ రోడ్డుపై గతుకులతో ఒక్కసారి బ్రేక్ వేశాడు. గమనించకుండా డ్రైవర్ బాలకృష్ణ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్లోనే ఇరుక్కున్న బాలకృష్ణను 108 సిబ్బంది మరో లారీ డ్రైవర్ల సహాయంతో తాళ్లను కట్టి అరగంట శ్రమించి బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ బాలకృష్ణ కు కాలు చేయి విరగగా తలకు గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అందిం చిన 108 పైలట్ శంకర్, ఈఎంటి నాగరాజు వరంగల్ ఎంజీఎం కు తరలించారు. ఈ సంఘ టనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.