కాలేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం, తెలంగాణ జ్యోతి : సరస్వతి పుష్కరాల నేపథ్యం లో భక్తుల రద్దీకి అనుగుణంగా తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేయడంతోపాటు, అన్ని అవసరమైన సౌకర్యాలను కల్పిస్తు న్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం రాత్రి కలెక్టర్ స్వయంగా తాత్కాలిక బస్టాండ్, సరస్వతి విగ్రహం, విఐపి ఘాట్, భక్తులు పుష్కర స్నానాలు చేసే త్రివేణి సంగమ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిగిలిన అన్ని పనులను బుధవారం వరకు పూర్తి స్థాయిలో ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులు సురక్షితంగా స్నానాలు చేయగలిగేలా ఘాట్ వద్ద విద్యుత్ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన అన్నారు. స్వచ్ఛ పుష్కరాలు కావాలని భక్తులు వినియోగించిన వ్యర్థాలను డస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని గ్రామ పంచాయతీ సిబ్బందికి అప్పగించాలని సూచించారు. వివిధ పనులకు ఉపయోగించిన తదుపరి మిగిలిన పనికిరాని వస్తువులను గ్రామ పంచాయతీ నిర్దేశించిన ప్రాంతాల్లో వేసి పరిశుభ్రతకు సహకరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిపిఓ వీరభద్రయ్య, భూపాలపల్లి ఆర్డిఓ రవి, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.