ఆదివాసులు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలి
– ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధించాలి
– విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
– పేదల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి
– తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
– రామప్ప, లక్నవరం, గణపురం కోటగుళ్ల సందర్శన
– ములుగు జిల్లాలో పర్యటన సక్సెస్
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : అడవిని నమ్ముకు ని జీవించే నిర్మలమైన మనసు గల ఆదివాసీలు, గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ములుగు జిల్లాకు చేరుకున్నారు. రోడ్డు మార్గంలో ములుగు జిల్లాకు చేరుకున్న గవర్నర్ కు ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ డాక్టర్ పి.శబరిష్, ఐటిడిఏ పిఓ చిత్రా మిశ్రా డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జీ, తదితరులు పూలమొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఆదివాసీ సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో మహిళలు చిన్నారులు గవర్నర్ కు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఉన్నత అధికారులతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్ ఓ లు ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి పై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తాను గవర్నర్ గా భాద్యతలు స్వీకరించిన తొలిపర్యటనలో షెడ్యూల్ ప్రాంతమైన ములుగు జిల్లాను ఎంచుకొని రావడం జరిగిందన్నారు. తాను కుడా గతంలో పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు బాగున్నాయని ప్రశంశిం చారు. పేదల అభ్యున్నతికి, గిరిజనులు ఆదివాసుల అభ్యు న్నతికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో గిరిజనులు, ఆదివాసులు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆధునిక సమాజంలో ఆదివాసులు గిరిజనులను భాగస్వా ములు చేసేందుకు ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయని వెల్లడిం చారు. జిల్లాలో కంటైనర్ హాస్పిటల్ వినూత్నంగా ఏర్పాటు చేయడం పట్ల మంత్రి సీతక్కను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ తొలి సారి జిల్లా పర్యటనకు గవర్నర్ రావడం పట్ల జిల్లా ప్రజల తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. ములుగు జిల్లా రాష్ట్రము లోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగి ఉందని, 30శాతం మంది ఆదివాసులు, గిరిజన ప్రజలు ఈ జిల్లా లో నివసిస్తన్నారని అన్నారు. జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నదని తెలిపారు. ఆసియా ఖండం లో అతి పెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం మహాజాతార ప్రతీ రెండు ఏళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ జాతర జాతీయ పండుగగా గుర్తించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. ములుగు జిల్లా చరిత్ర, పర్యాటక కేంద్రాలు, జిల్లా విశిష్టత, విశేషాలను గవర్నర్ కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా స్థితిగతులు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా మాతృ, శిశు మరణాల రేటు తగ్గాయని పేర్కొన్నారు. మంత్రి ప్రత్యేక చొరవ తో గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాలను తగ్గించినట్లు తెలిపారు. సమ్మక్క, సారలమ్మ యూనివర్సిటీ అడ్మిషన్స్ ప్రారంభం అయ్యాయని తెలిపారు. జిల్లా లో అడవులు సంరక్షణ కు అన్ని తీసుకొంటున్నామని, క్రైమ్ రేట్ తగ్గిందని పేర్కొన్నారు. ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ముందుకు పోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో జిల్లాను అన్ని రంగాల్లో ముందు ఉంచేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి సీతక్క గవర్నర్, ప్రిన్సిపాల్ సెక్రటరీల ను శాలువా తో సత్కరించారు. ఆదివాసీ చిత్రాలకు సంబంధించిన జ్ఞాపకాల ను బహుకరించారు.
– జాతీయ అవార్డు గ్రహీతలతో కలిసి గవర్నర్ భోజనం
ములుగులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర గవర్నర్ జిల్లాకు చెందిన రచయితలు, కవులు, కళాకారులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడా, అవార్డు గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కలిసి భోజనం చేశారు. ఇన్టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, రచయిత డాక్టర్ రాచర్ల గణపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అంబటి శ్రీజన్, రెజ్లింగ్ క్రీడాకారిని చల్ల మౌనిక, జిమ్నాస్టర్ పి.రజిత, వాలీబాల్ జాతీయ క్రీడాజట్టు కోచ్, గోల్డ్ మెడలిస్ట్ పాలడుగు వెంకటేశ్వరరావు, ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ కాజంపురం దామోదర్, సోషల్ వర్కర్ కొమరం ప్రభాకర్, నేషనల్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత, మ్యాథ్స్ టీచర్ డాక్టర్ కందాల రామయ్య, తదితరులతో సమావేశం అయ్యారు. ములుగు జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావడం పట్ల వారిని అభినందించారు.
– రామప్ప, కోటగుళ్లు దర్శనం
వెంకటాపూర్ మండలం పాలంపేటలోగల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు ఉమాశంకర్, హరీష్ శర్మలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారి వస్త్రాలను అందజేశారు. అనంతరం ప్రొఫెసర్ పాండురంగారావు తో పాటు ఆలయ గైడ్ లు తాడబోయిన వెంకటేష్, గోరంటల విజయ్ కుమార్, టూరిజం అధికారులు ఆలయ శిల్ప కళావైభవం, కాకతీయుల చరిత్రపై వివరించారు. ఆలయ గోపురంపై ఉన్న నీళ్లలో తేలే ఇటుకల గురించి, ఇసుక, డంగు సున్నంతో నిర్మించిన టెక్నాలజీని వివరించారు. అక్కడి నుంచి భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లలో గణపేశ్వరాలయాన్ని సందర్శించారు. భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావుతోపాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కరేల ఆధ్వర్యంలో ఆలయ అర్చకుడు నరేష్ శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోశాల నిర్వహణపట్ల కోటగుళ్లు పరిరక్షణ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జ్క్షాపికను అందజేశారు. అనంతరం అక్కడి నుంచి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సుకు గవర్నర్ చేరుకున్నారు. ఉయ్యాలవంతెనపై నడుస్తూ సరస్సు అందాలను వీక్షించి అబ్బురపడ్డారు. మంత్రి సీతక్కతో కలిసి బోటింగ్ చేసిన గవర్నర్ మంగళవారం రాత్రి అక్కడే బస చేశారు. ఈ కార్యక్రమాల్లో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, సీహెచ్.మహేందర్ జీ, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కరే, ఏఎస్పీ సంపత్ రావు, భూపాలపల్లి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ కుమార్, ములుగు, పస్రా సీఐలు శంకర్, రవీందర్, ఎస్సైలు వెంకటేశ్వర్ రావు, సతీష్, కమలాకర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.