ఇంటర్ పరీక్షా కేంద్రాలను సందర్శించిన అదనపు ఎస్పి
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇంటర్ పరీక్షా కేంద్రాలను శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పి ఏ. నరేష్ కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై అదనపు ఎస్పీ పర్యవేక్షించారు. ఎగ్జామ్ జరుగుతున్న పరీక్షా కేంద్రాల పరిసరాలపై పోలీసులతో పాటు, ఇన్విజిలెటర్లు దృష్టి పెట్టాలని, ఎలాంటి కాపీయింగ్ కు తావు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, 144 సెక్షన్ అమలు లో ఉన్నందున పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ప్రజలు గుంపులు ఉండకుండా జాగ్రత్త పడాలని ముఖ్యంగా పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, మరియు సెల్ ఫోన్లకు అనుమతి లేదని, విద్యార్థులు, సిబ్బంది, పరీక్షా నిర్వాహకులు సెల్ ఫోన్ తీసుకెళ్ళవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు ఎస్పీ హెచ్చరించారు. ఈ పరీక్షా కేంద్రాల సందర్శనలో భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ పాల్గొన్నారు.