ప్రెషర్ బాంబు పేలి మహిళకు తీవ్ర గాయాలు.
– కొండలపై బెడం మల్లన్న తీర్థయాత్రలో విషాదం.
– భద్రాచలం వైద్యశాలకు తరలింపు.
తెలంగాణ జ్యోతి, వెంకటాపురం : ములుగు జిల్లా వెంకటా పురం శివారు చొక్కాల గ్రామానికి చెందిన సుమారు వంద మందికి పైగా గ్రామస్తులు గురువారం వేకువ జామున చత్తీస్గడ్ సరిహద్దులోని కొండలపై వెలసిన బెడం మల్లన్న దర్శనార్థం కాలినడకన తరలి వెళ్లారు. ఈ క్రమంలో బెడం మల్లన్న సమీప కొండల వద్ద డర్రా సునీత అనే మహిళ మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై కాలు పడటంతో భీకర శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో సునిత పాదం పేలుడుకు చిద్రం అయింది. వెంటనే సహచర తీర్థయాత్ర గ్రామస్తులు ప్రయాణాన్ని మానుకొని, ఆమెని జట్టీలు కట్టి హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు గురు వారం రాత్రి పొద్దుబోయే సమయానికి వైద్యం కోసం తీసుకు వచ్చారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే వెంకటాపురం పోలీసులు సైతం ఆరాతీసి సహాయచర్యల్లో పాల్గొన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రురాలు సునీతను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు. ఇటీవల కాలంలో ప్రెషర్ బాంబు పేలి వాజేడు మండలం జగన్నా ధపురం గ్రామస్తుడు కొంగాల అటవీ ప్రాంతంలో బాంబుపై కాలు పడటంతో బాంబు పేలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మరువకముందే సరిహద్దులోని దట్టమైన అడవుల్లో మరో బాంబు పేలటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, ప్రెషర్ బాంబు పేలుడు ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.