వెంకటాపురం ప్రధాన రహదారిపై విరిగిపడిన మర్రిచెట్టు.
– తృటిలో తప్పిన ప్రాణాపాయం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా అర్బన్ క్యారెక్టర్ కలిగిన వెంకటాపురం పట్టణంలో ప్రధాన రహదారిపై ఏపీజీవీబీ బ్యాంక్ ఎదురుగా బ్రిటిష్ కాలం నాటి మర్రిచెట్టు కొమ్మలు ప్రధాన రహదారి పై విరిగిపడ్డాయి. వచ్చే పోయే వాహనాలతో రద్దీగా ఉండే ఈ రహదారిపై భారీ మర్రిచెట్టు కొమ్మలు ఫేళఫేళ మంటూ భీకర శబ్దాలతో మంగళ వారం వేకువజామున విరిగిపడ్డాయి. చెట్ల కొమ్మలు కరెంటు వైర్ల పై పడటంతో అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఐసిఎస్ అధికారి విన్ బ్రో ఆధ్వర్యంలో 1912 సంవత్సరం భద్రాచలం నుండి టేకులగూడెం వరకు నీడనిచ్చే చింత చెట్లు, మర్రి చెట్లును నాటారు. 100 సంవత్సరాలు దాటిన భారీ వృక్షాలు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అనేకచోట్ల ప్రక్రుతి వైపరీత్యాల సమయంలో, చెట్లు రహదారిపై కూలిపో వడంతో, అనేక గంటలపాటు ట్రాఫిక్కు స్తంభించిపోతుంది. అలాగే వెంకటాపురం పట్టణ కేంద్రంలోని జగదాంబ థియేటర్ వద్ద మర్రిచెట్టు పై కొమ్మలు విరిగి కింద ఉన్న కొమ్మలపై తట్టుకొని ఉన్నాయి. రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో సైతం ఆ కొమ్మలు ఎప్పుడు విరిగి మీద పడతాయని ప్రజలు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రమాదభ రితంగా ఉన్న, చెట్ల కొమ్మలను తొలగించాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలు, రోడ్లు భవనాల శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.