వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే : బడే నాగజ్యోతి
తెలంగాణ జ్యోతి,ఏటూరునాగారం ప్రతినిధి : ములుగు జిల్లా ఏటూరునాగారం డివిజన్ ఏజెన్సీ గ్రామాలలో ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుండి 9 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో చేస్తున్న ప్రచారానికి ప్రజలు,కుల సంఘాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.గ్రామాలలో పార్టీ నాయకులు,కార్యకర్తలు ఇంటింటి ప్రచారాలు చేస్తున్నారు. ఆదివారం కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు గమనించాలన్నారు.రైతుబంధు,రైతు భీమా,కల్యాణ లక్ష్మీ, పెన్షన్లు,మిషన్ భగీరథ వంటి పథకాలు అమలు దేశంలోనే తెలంగాణ ఆదర్శమని అన్నారు.అంతేకాకుండా గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ ములుగు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ములుగు నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ములుగును జిల్లాగా చేయడమే కాకుండా ఏటూరునాగారంను డివిజన్ గా ప్రకటించి, మల్లంపల్లిని మండలంగా చేయడం,ఏజెన్సీ ప్రాంత వాసులకు వైద్యం అందుబాటులో ఉండేలా జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజి మంజూరు చేశారని అన్నారు. ములుగు ప్రాంత వాసులు సంక్షేమ పథకాలను,జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిత్యం ప్రజల కోసం పోరాడి అమరులైన ఉద్యమకారులైన బడే ప్రభాకర్, రాజేశ్వరి దంపతుల బిడ్డను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని వేడుకున్నారు.50 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి,సంక్షేమ పథకాలు గుర్తుకు రాలేదు కానీ,ఇప్పుడు అధికార దాహంతో మోసపూరిత వాగ్దానాలు, గ్యారంటీలు అంటూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ చెంప చెల్లుమనిపించేలా కారు గుర్తుకు ఓటు వేసి ములుగులో బిఆర్ఎస్ అభ్యర్థి గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.అనంతరం ప్రజల సంక్షేమానికై పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే అభ్యర్థుల సమక్షంలో సుమారు 300 మంది కుల సంఘాల మహిళలు టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మంగపేట అధ్యక్షుడు, యూత్ నాయకుడు కర్ర రవీందర్, నాయకులు ప్రదీప్,గండేపల్లి నర్సయ్య,ఖలీల్,శ్రీనివాస్ రెడ్డి, వడ్డెర సంఘం నాయకులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
1 thought on “వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే : బడే నాగజ్యోతి”