రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే : సీతక్క
తెలంగాణ జ్యోతి,ఏటూరునాగారం ప్రతినిధి : రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి ఆని కాంగ్రెస్ అంటేనే పేదల పక్షం అని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ధనసరి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో గురువారం సీతక్క ముత్యాలమ్మ అమ్మవారికి మొక్కులు సమర్పించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు తనను ఓడించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, డబ్బు సంచులతో ములుగులో గెలవాలని చూస్తున్నారని,నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవకే అంకితమైన నన్ను అవమాన పరుస్తూ బిఆర్ఎస్ నాయకులు తనను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.కరోనా సమయంలో గానీ,వరదల సమయంలో గానీ ప్రజలకు తోడుగా ఉండి ప్రజల మధ్య నిత్యం అందుబాటులో ఉండి వారి కష్టసుఖాలలో పాలుపంచుకున్నానని, ప్రజాసేవకే అంకితమైన తాను అసెంబ్లీలో ములుగు నియోజకవర్గానికి అవసరమైన అభివృద్ధి గురించి ప్రభుత్వాన్ని నిలదీశానని,అది దృష్టిలో పెట్టుకొని బిఆర్ఎస్ నాయకులు 200 కోట్లు అయినా ఖర్చు పెట్టి ములుగు నియోజకవర్గంలో తనను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్ నాయకులకు డబ్బు బలం ఉంటే తనకు ప్రజాబలం ఉందని,ఆ బలంతోనే ఈ ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు.రాష్ట్రంలో ఏర్పాటు అయ్యేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రభుత్వంలో తనకు మంత్రిగా అవకాశం వస్తుందని,ములుగు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.బిఆర్ఎస్ నాయకులు ఓటుకు 5 వేలు ఇచ్చినా తీసుకోండని,ఓటు మాత్రం కాంగ్రెస్ చేయి గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఐదు లక్షలతో ఇండ్లు నిర్మించి ఇస్తామని, రైతులకు ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని,పింఛన్లు 4 వేలు ఇస్తామని,రైతు బంధు పథకం ద్వారా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఎకరాకు 15 వేలు,కౌలు రైతులకు 12 వేల చొప్పున ఇస్తామని అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అంతేగాక గృహిణులకు గ్యాస్ బండ గుదిబండగా మారిందని,దాన్ని 500 రూపాయలకే ఇచ్చి గృహిణులను ఆదుకుంటామని ఈ సందర్భంగా సీతక్క తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు ఇరసవడ్ల వెంకన్న,మండల అధ్యక్షుడు చిటమట రఘు,నాయకులు ఖలీల్,గుడ్ల దేవేందర్,చిన్న ఎల్లయ్య,సిరాజ్,రంజిత్,కిషోర్,శ్రీనివాస్,రాధిక,భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.