బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి పూమా నామినేషన్
- ఎమ్మెల్యేగా బరిలో రిటైర్డ్ లెక్చరర్ పోరిక పూమానాయక్
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : భారత రాష్ట్ర సమితి రెబల్ అభ్యర్థిగా టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, విశ్రాంత అధ్యాపకుడు పోరిక పూమా నాయక్ బరిలో నిలిచి, బుధవారం రోజున ములుగు ఏరియా సివిల్ ఆస్పత్రి నుండి ప్రేమనగర్ వరకు భారీగా మహిళలతో ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పీవో అంకిత్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పూమా నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో 23ఏళ్ల ప్రస్థానం ఉందని, కానీ కొందరు కొత్తగా వచ్చిన నాయకుల తీరు అవమానకరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నుంచి తనకు అవకాశం ఇస్తానని 2002సమయంలోనే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, తరువాత పరిణామాల దృష్ట్యా పార్టీ కోసం కష్టపడుతూ వచ్చానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పదవులు కూడా ఇస్తానన్న సీఎం ఇచ్చిన మాట మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్న ఉద్యమకారులు, సీనియర్ నాయకులను కొత్తగా వచ్చిన వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విసిగిపోయి తాను రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని, తప్పక తన సత్తా చూపుతానని పూమా నాయక్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, పూమానాయక్ అనుచరులు తదితరులు పాల్గొన్నారు.