తుఫాన్ కారణంగా ఖరీఫ్ వరి పంట రైతన్నల ఆందోళన.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలంలో ఖరీఫ్ వరి పంటలు కోతలు కోసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ వాయుగుండం ప్రభావంతో మబ్బులు కమ్మిన ఆకాశం, వర్ష సూచనలు కారణంతో పంట చేతికి వచ్చే దశలో, తుఫాను హెచ్చరికలతో వరి రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే వరి కోతలు యంత్రాల ద్వారా కోతలు కోసి కల్లాలలో దాన్యాన్ని ఆరబెట్టి, వర్షాలకు తడవ కుండా ధాన్యాన్ని కాపాడుకుంటున్నారు. తెలంగాణ జిల్లాలలో భారీవర్ష సూచనలు తో రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావ రణ శాఖ మీడియా ద్వారా, వార్తా చానల్ ద్వారా హెచ్చరికలు జారీ చేయడంతో, రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కల్లాలలో ఆరబోసిన ధాన్యాన్ని, రాసులుగా తోసి, ప్లాస్టిక్ బరకాలతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అంతేకాక గాలి దుమారాలకు ప్లాస్టిక్ పరదాలు కొట్టుకుపోతే ధాన్యం తడిసిపోయే అవకాశం ఉందని, తడిసిపోయిన ధాన్యం రంగు మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పంటలు చేతికి వచ్చిన దశలో బంగాళాఖాతం తుఫాను కారణంగా రైతులు వరి పొలాల్లో బురద కారణంగా చైన్ మిషన్లతో కోతల కోసే అవకాశం ఉందని, చైన్ వరి మిషన్లను వరి కోతలకు వినియోగిస్తే ఎకరానికి నుండి 1500,2,000 వేల రూపాయలు వరకు అదనంగా ఖర్చు వస్తుందని అంటున్నారు. అంతేకాక భారీ వర్షాలతో గింజలు రాలిపోయే అవకాశం ఉందని ఖరీఫ్ రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. సాయంత్రం నాటికి దట్ట మ్మన మబ్బులు కమ్మిన ఆకాశం వర్షాలు పడే సూచనలు కనపడటంతో సోమవారం నుండి రైతులు వరి పొలాల కోతలను నిలిపివేశారు. అలాగే వేలాది ఎకరాల్లో ప్రధాన వాణిజ్య పంటైన మిర్చి తోటలకు మబ్బులు కారణంగా సిలింద్ర జాతి తెగుళ్ళతో పాటు పురుగు, ఇతర తెగులు ఆశించే అవకాశం ఉందని వెంకటాపురం, వాజేడు మండలాల మిర్చి రైతులు, మొక్కజొన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన మబ్బులు కమ్మి భారీ వర్షాలు పడే సూచనలు కనపడటంతో ఖరీఫ్ పరి రైతులు, మిర్చి పంట సాగు చేస్తున్న రైతులు ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.